ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 'మురసు' తుఫాన్ తీవ్రంగా చుట్టుముట్టింది. ఈ తుఫాన్ వల్ల సంభవించిన భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా రాష్ట్రంలో ఊహించని స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. తుఫాన్ ధాటికి సంభవించిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా సమగ్ర అంచనా వేసింది.ప్రభుత్వ ప్రాథమిక నివేదిక ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా మురసు తుఫాన్ సృష్టించిన విధ్వంసం వల్ల సుమారు రూ. 1,918 కోట్ల నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. మౌలిక సదుపాయాలు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఈ తుఫాన్ ప్రభావం రైతులకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. దాదాపు 1.43 లక్షల హెక్టార్లలో వరి, ఇతర వాణిజ్య పంటలు నీటమునిగి దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. చేతికి వచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.
8 మంది మృతి – జిల్లాల వారీగా వివరాలు :- వర్షాలు, ఇళ్ల కూల్చివేతలు మరియు ఇతర ప్రమాదాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
బాపట్ల జిల్లా- 5 మంది
గుంటూరు జిల్లా-2 మంది
పల్నాడు జిల్లా-1 వ్యక్తి
ఈ విషాద సంఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.తీవ్ర తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. వరద తీవ్రతను, ముంపునకు గురైన గ్రామాలు మరియు పంట పొలాలను పరిశీలించారు.అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. నష్ట పరిమాణాన్ని తెలియజేస్తూ తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపాలని ఆదేశించారు. బాధిత ప్రజలకు ఆహారం, సురక్షిత మంచినీరు, వైద్య సదుపాయాలు తక్షణమే అందించాలని సూచించారు. దెబ్బతిన్న పంటలకు మరియు మృతుల కుటుంబాలకు త్వరలోనే తగిన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.