Newsbuzz, andrapradesh :- ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం తీవ్ర వేడిని రాజేస్తోంది. ఇటీవల విలేకరుల సమావేశంలో మాట్లాడిన వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. సుదీర్ఘంగా మూడు గంటల పాటు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో జగన్ ఎన్నో నీతులు చెప్పారని, కానీ ఆయన హయాంలో జరిగిన పరిణామాలను విస్మరించారని ఎద్దేవా చేశారు.వైసీపీ పాలనా కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా ఏకగ్రీవాలు జరిగాయని చంద్రబాబు గుర్తుచేశారు. ఆ సమయంలో బెదిరింపులు, అక్రమాలతో ఏకగ్రీవాలు సాధించారని ఆయన విమర్శించారు. అలాంటిది ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
అంతేకాకుండా, జగన్ ప్రెస్ మీట్ ముగిసిన వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) వద్దకు వెళ్లి ప్రవర్తించిన తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్ దగ్గరకు వెళ్లి ఆయనను బెదిరించేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న అధికారి పట్ల ప్రవర్తించే విధానం ఇదేనా అని నిలదీశారు.సమావేశం ముగిసిన వెంటనే తన సొంత మీడియాను వెంటబెట్టుకుని SEC వద్దకు వెళ్లి లైవ్ కవరేజ్ ఇవ్వడం మునుపెన్నడూ చూడలేదని చంద్రబాబు అన్నారు. రాజ్యాంగ సంస్థలపై ఒత్తిడి తేవడానికి, వారిని భయభ్రాంతులకు గురిచేయడానికే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ వైఖరి ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచేలా ఉందని, ఇటువంటి చర్యలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.