న్యూస్ బజ్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజుల పాటు వాతావరణం మారనుంది. నైరుతి రుతుపవనాల ప్రభావం మరియు ఉపరితల ఆవర్తనం కారణంగా రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
గురువారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అల్లూరి సీతారామరాజు, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమలోని అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇక తెలంగాణలోనూ వాతావరణ శాఖ అప్రమత్తమైంది. పలు జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వాలు సూచించాయి. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.